ఆడపిల్లలకి సుకన్య స్కీం ఉంది. మరి మగ పిల్లలకి ఏ స్కీం బాగుంటుంది?

మగ పిల్లలకోసం పోస్ట్ ఆఫీస్ అద్భుత స్కీం



భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం 2015 లో సుకన్య సమృద్ది యోజన అనే స్కీం ప్రారంభించింది. అప్పటినుంచి  ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య అకౌంటు తెరుచుకుని అందులో డబ్బులు దాచుకుంటున్నారు. 

ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుకన్య స్కీం ఒక మంచి ఆదాయం ఇచ్చే స్కీం. మరి ఆడపిల్లలు లేని వారి పరిస్తితి ఏంటి?

మగ పిల్లలు ఉన్నవారు కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారే. మరి వాళ్ళు ఏ స్కీంలో డబ్బులు దాచుకుంటే సుకన్య స్కీం అంత లాభం వస్తుంది? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారు.

దానికి సమాధానం చెప్పాలంటే, దురదృష్టవశాత్తు సుకన్య సమృద్ది యోజన స్కీం అంత లాభం ఇచ్చే స్కీం మరొకటి భారత దేశంలో లేదు. 

అయ్యో! మరి మా మగ పిల్లల కోసం నెల నెల కాస్త దాచుకుందామంటే ఎలా? అని మీ మనసులో ప్రశ్న వచ్చే ఉంటుంది. 

సుకన్య అకౌంటు కి అత్యధిక వడ్డీ ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆడపిల్లల పెళ్ళి సమయాల్లో కుటుంబాలు అప్పులపాలు అయ్యి ఇబ్బందులు పడుతున్నాయని, పాప చిన్నపటి నుంచే తల్లిదండ్రుల్లో పొదుపు చేసుకునే అలవాటు చేస్తే ఈ సమస్య నుంచి కొంతైనా బయటపడగలరని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

అలాంటి ప్రత్యేకమైన పరిస్తితులు సాధారణంగా మగపిల్లలకు ఉండవు కాబట్టి ఇంత వడ్డీ వేరే స్కీంలలో వచ్చే పరిస్తితి లేదు. మరి సుకన్య తరువాత అత్యధిక వడ్డీ ఇచ్చే స్కీం ఏదైనా ఉందేమో చూద్దాం.

సుకన్య స్కీం రూపకల్పన 1968 నుంచి అమలులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీం నుంచి జరిగింది. 

సుకన్య సమృద్ధి యోజన రాక ముందు మన దేశంలో అత్యధిక వడ్డీ ఇచ్చే స్కీం ఏదైనా ఉంది అంటే అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీం మాత్రమే. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీం పూర్తి వివరాలు:

  • PPF స్కీం కాల వ్యవధి 15 సంవత్సరాలు.
  • వయసుతో సంబంధం లేకుండా ఈ స్కీంలో ఎవరైనా అకౌంటు తెరుచుకోవచ్చు.
  • ఒక సంవత్సరంలో కనీసం 500 కట్టాలి. గరిష్టంగా 1,50,000/- వరకు ఒక సంవత్సరంలో జమ చేసుకోవచ్చు. సాధారణంగా మనం నెల నెల కొంత డబ్బు జమ చేయడానికి ఆశక్తి చూపిస్తాం. అలాంటి వారు నెలకి కనీసం 100 నుంచి నెలకి 12500/- వరకు జమ చేసుకోవచ్చని అర్ధం.
  • PPF 15ఏళ్ల కాలం తీరాక కావాలనుకుంటే 5ఏళ్ళు పొడిగించుకోవచ్చు. అంటే అప్పుడు స్కీం 20ఏళ్ల స్కీం అవుతుంది. ఇలా 5 ఏళ్ళు ఎన్ని సార్లైనా పొడిగించుకోవచ్చు.
  • స్కీంలో ఎకౌంటు తెరిచాక, 4 ఏళ్ల తరువాత లోన్ తీసుకోవచ్చు. 7 సంవత్సరాల తరువాత ప్రతీ ఏడాది ఒకసారి నగదు ఉపసంహరించుకోవచ్చు (withdraw చేసుకోవచ్చు). 
  • ప్రస్తుతం PPF మీద వడ్డీ 7.1% ఉంది. సుకన్య తరువాత అత్యధిక వడ్డీ రేట్ ఇదే.
  • ఇందులో మనం జమ చేసే డబ్బుకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతీ ఏడాది వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అలానే కాల పరిమితి తీరాక వచ్చే పూర్తి డబ్బుకి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

PPF ద్వారా ప్రతీ ఏడాది 731000/- వడ్డీ పొందడం ఎలా?


మీ మగ పిల్లల పూర్తి జీవిత కాలం ప్రతీ ఏడాది రూ.731869/- వచ్చేలా PPF ద్వారా చెయ్యొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

PPFలో ప్రతీ ఏడాది మనం గరిష్టంగా రూ.1,50,000/- డిపాజిట్ చెయ్యొచ్చని మనం ముందు తెలుసుకున్నాం. మీ అబ్బాయి పుట్టిన వెంటనే బాబు పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో PPF ఎకౌంటు తెరవాలి. 

తెరిచిన నాటి నుంచి బాబుకి 25 ఏళ్ళు వచ్చే వరకు ప్రతీ ఏడాది రూ.1,50,000/- ఆ ఎకౌంటు లో డిపాజిట్ చెయ్యాలి. PPF ఎకౌంటు ను 15 ఏళ్ల తరువాత 5 ఏళ్ళు పొడిగించవచ్చని మనం పైన తెలుసుకున్నాం. అలా ఎన్ని సార్లైనా 5 ఏళ్ళు పొడిగించవచ్చు. 

అంటే 15 ఏళ్ల తరువాత ఒకసారి, 20 ఏళ్ల తరువాత ఒకసారి పొడిగించాలి. ఇప్పుడు ఉన్న వడ్డీ 7.1% ప్రకారం, ఖాతా తెరిచి 25 ఏళ్ళు గడిచే సరికి బాబు పేరు మీద ₹1,03,08,015 జమ అవుతాయి. 

25 ఏళ్ల తరువాత కూడా మనం ఖాతా ని పొడిగించవచ్చు. మరో 5 ఏళ్ళు పోడిగించాలి. ఇక నుండి డబ్బు అకౌంటులో జమ చెయ్యాల్సిన పని లేదు. ఖాతాలో ఉన్న కోటి రూపాయలకు గాను 7.1% వడ్డీ చొప్పున వడ్డీ ఏడాదికి ₹731869/- వస్తుంది.  PPF లో ప్రతీ ఏడాది మనం 1 సారి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పైన తెలుసుకున్నాం. ఆ ప్రకారం ప్రతీ ఏడాది కేవలం వచ్చిన వడ్డీ మాత్రమే విత్ డ్రా చేసుకుంటూ ఖాతాని మీ బాబు జీవితాంతం కొనసాగించవచ్చు. ఇలా వచ్చే వడ్డీకి మీరు ఆదాయపు పన్ను కూడా కట్టే అవసరం లేదు.

అంటే బాబుకి ఒక స్థిరమైన ఆదాయం కలిపించిన వారు అవుతారు మీరు. అలానే బాబుకోసం కోటి రూపాయలు పైన ఒక మంచి అమౌంట్ జమ అయ్యి ఉంటుంది.

వడ్డీ రేటు తక్కువ ఉన్నా కూడా ఒక విధంగా చెప్పాలంటే సుకన్య సమృద్ధి యోజన పధకం కన్నా PPF వల్ల చాలా ఆదాయం పొందుతారు. 

మీ చిన్నారి అబ్బాయికి మీరు ఇచ్చే అతి విలువైన ఒక బహుమతి పోస్ట్ ఆఫీస్ PPF పథకంలో అకౌంటు. 

PPF పథకంలో అకౌంటు తెరవడానికి కావాల్సిన అప్లికేషన్ ఫారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి కేవలం 
₹500/- కట్టి PPF ఖాతా తెరవచ్చు.




PPF ఖాతా ని వెంటనే తెరిచి మీ అబ్బాయి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టండి. 

సదా మీ మేలు కోరే
మీ 
YY