మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణాన్నుండి రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురు లాగా ఉండే క్రొవ్వు పదార్థాన్ని వదులుతూ ఉంటుంది. దీని వలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది. తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేడుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూ ఉంటుంది.
స్నానం రోజూ శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడే వారికి కూడా అందులో కెమికల్స్ చర్మం పై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేట్లు చేస్తాయి. షాంపు పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజు నుండి వాటి నష్టం బయట పడుతుంది. చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు, దీనికోసం ఏ మందులూ వాడవద్దు.
చిట్కాలు:
- ప్రతిరోజూ చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడి నీళ్ళు తలకు పోయకూడదు. నీళ్ళు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటి లాగా) ఆ నీళ్ళు పోసుకోండి.
- వారానికి, పది రోజులకొకసారి కుంకుడు కాయ రసంతో తలంటుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజూ ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతి రోజూ కుంకుడు రసం వాడండి).
- తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుందనుకుంటారు. రోజూ తల స్నానం చేసే వారికి ఏమి కాదు. చలికాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే, చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు.
- తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజూ (ఒక చెక్క లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తలపై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.
0 Comments