మెడ దగ్గర నుండి ముడ్డి భాగం వరకూ వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఇటుకకు ఇటుకకు మధ్య సిమెంట్ పొర ఉన్నట్లే పూసకు పూసకు మధ్య ఒక మెత్తటి దిండులాంటి భాగం ఉంటుంది. దానినే డిస్క్ అంటారు.
మనం బరువును పట్టుకున్నప్పుడు లేదా మోస్తున్నప్పుడు ఆ బరువు పూసలమీద పడకుండా పూసకు పూసకు మధ్య డిస్క్ లు స్ప్రింగ్ లాగా వత్తిడి తెలియకుండా మెత్తదనాన్నిస్తాయి. కారు గోతులలో వెళ్ళినా లోపలున్న వారికి కుదుపుడు తెలియకుండా స్ప్రింగ్ లు కాపాడినట్లే డిస్క్ లు మన వెన్నెముకను కాపాడుతూ ఉంటాయి.
ఎప్పుడూ ముందుకే వంగి కూర్చొని ఆఫీసుల్లో పని చేసుకునేవారికి, వంకరటింకరగా కూర్చునేవారికి, మెత్తటి పరుపుల మీద పడుకునే వారికి, స్కూటర్ల మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ డిస్క్ లు వత్తిడికి గురి అవుతాయి. దీని కారణంగా నడుము నొప్పి, కాలుజాలు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ శ్రమ చేసినపుడు నడుము కండరాలు కూడా వత్తిడికి గురి అవుతాయి.
దీని వల్ల నడుము మధ్యభాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ముందుకు వంగితే ఎక్కువ అవుతూ ఉంటుంది. విశ్రాంతిలో బాగుంటుంది.
చిట్కాలు:
- స్పాంజి పరుపులు మాని పలుచని బొంతలాంటి వాటిపై పడుకోవడం మంచిది.
- నడుము భాగానికి నూనె రాసి రబ్బరు బ్యాగ్ లో వేడి నీరు పోసి రెండు పూటలా కాపడం పెట్టుకుంటే కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
- నడుమును ముందుకు వంచే పనులు మాని ఎక్కడ కూర్చున్నా నిటారుగా కూర్చుంటే మంచిది.
- ప్రతి రోజూ నడుమును ముందుకు వంచే వ్యాయామాలు పూర్తిగా మాని, కేవలం వెనక్కి వంచే ఆసనాలను మాత్రమే చేస్తే మంచిది. అవి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనము మొదలగునవి. అవకాశముంటే రెండు పూటలా వీటిని చేస్తే త్వరగా తగ్గుతుంది.

0 Comments