ఏ ఆహారం తింటే కరోనా వచ్చినా తట్టుకునే సామర్ధ్యం మన శరీరానికి వస్తుంది.??



మహమ్మారి కరోనాకు ప్రస్తుతానికైతే ఎలాంటి మందు లేదు. మరి ఈ ప్రాణాంతక వైరస్ విషపు కోరల నుంచి ఎలా బయటపడాలి? ఇందుకు మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటే కరోనా వైరస్సే కాదు ఇతరత్రా చాలా జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చు.




మరి కరోనా పై పోరులో వ్యాధి నిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం కోసం ఏం తినాలి? ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వ్యాసంలో మీకోసం.

గతంలో వచ్చిన వైరస్లతో పోల్చుకుంటే కరోనా పెద్దగా ప్రమాదకరమైనదేమి కాదు. వ్యక్తిలో రోగనిరోధకశక్తి బలీయంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలకు కారణాలను పరిశీలిస్తే వృద్ధులు, చిన్న పిల్లలే ఈ మహమ్మారికి ఎక్కువగా బలవుతున్నారు.


అంటే వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిపై కరోనా తన ప్రతాపం చూపుతోందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో కరోనా పై పోరులో మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనలోని ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం పైన దృష్టి పెట్టాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.




దీర్ఘకాలీనంగా మనం ఎక్కువగా మన ఆరోగ్యం పెంచుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు ఈ ఆహారంలో విటమిన్లు  ఎక్కువగా ఉండాలి. A, D, E, C.. ఈ నాలుగు విటమిన్లు ఎక్కువగా ఉండాలి. A, D, E విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు. C విటమిన్ నీటిలో కరిగే విటమిన్.

వీటితో పాటు కొన్ని ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా మన శరీరానికి అవసరం. ZINC, IRON, SELENIUM లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.


విటమిన్ A కోసం ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్ధాలలో విటమిన్ A కెరోటిన్ రూపంలో ఉంటుంది. మనం తీసుకున్న తర్వాత ఆ కెరోటిన్ విటమిన్ A గా మారుతుంది. కొంత జంతు సంబంధమైన ఆహార పదార్థాలు ముఖ్యంగా వెన్న, నెయ్యి, పన్నీరులలో కూడా మనకి విటమిన్ A లభిస్తుంది.

విటమిన్ A తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ A లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా దోహదపడతాయి. విటమిన్ A కోసం కూరగాయలు (క్యారట్, బీట్ రూట్, క్యాప్సికం లాంటివి), పసుపు రంగు పండ్లు (మామిడి పండు, బొప్పాయి లాంటివి) ప్రతిరోజూ ఆహారం లో తప్పనిసరిగా తీసుకోవాలి.



విటమిన్ C  పులుపు పండ్లు అంటే నారింజ, మామిడి,నిమ్మ లాంటి పండ్లలో లభిస్తుంది. వేడి తగిలితే విటమిన్ C పాడవుతుంది.

మహమ్మారి కరోనా పై విజయం సాధించాలంటే లాక్ డౌన్ పాటించడం, వ్యాధి  నిరోధక శక్తిని పెంచుకోవడం. ఈ రెండే మార్గాలు.

పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ప్రధానంగా చిరుధాన్యాలను, డ్రైఫ్రూట్స్ ను తీసుకోవడం మరియు పుల్లగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ C సమృద్ధిగా లభిస్తుంది. మనలోని వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.




అల్లం, వెల్లుల్లి, గ్రీన్ టీ లాంటివి కూడా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచుగా తీసుకోవాలి.

మాంసాహారం విషయానికొస్తే చేపలు తినడం మంచిది. బొచ్చెలు, శీలావతి వంటి తెల్లరకం చేపల్ని తీసుకోవచ్చు. పీతల్నికూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో  మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జింక్ ఎక్కువగా పప్పుల్లోనే దొరుకుతుంది. ముడి పప్పులు అంటే శనగలు, పెసలు, అలసందలు లాంటి పొట్టుతో ఉన్న పప్పుల్ని నానబెట్టి మొలకలు రాగానే తింటూ ఉంటే మనకి కావలసినంత జింక్ వస్తుంది.

ఐరన్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల ఆకుకూరలు ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది.

సెలీనియం అనేది అన్నిరకాల పదార్ధాలలో దొరుకుతుంది.


మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటూ మన వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకుంటూ ఉండాలి.

మన పేగులలో మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడే బాక్టీరియా ఉంటుంది. దానిని పెంపొందించడానికి ఎక్కువగా పులియబెట్టిన ఆహార పదార్ధాలు వాడాలి. పులియపెట్టినవి అంటే పెరుగు, ఇడ్లీ పిండి, దోస పిండి లాంటివి. వీటిలో ప్రో-బయాటిక్స్ అనేవి ఉంటాయి. ఇవి మన జీర్ణ కోసంలో ఉండే బాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. దీనివల్ల జీర్నశక్తి బాగా మెరుగుపడుతుంది.



మన ఒంట్లో వ్యాధినిరోధక యంత్రాంగాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి.



కరోనాను కట్టడి చేయడానికే కాదు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి. తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే  మహమ్మారి కరోనాను మనం ఖచ్చితంగా కట్టడి చేయగలం.


Post a Comment

0 Comments