పడుకున్నాక 1, 2 గంటలు అటు ఇటు దొర్లగా ఎప్పటికో నిద్ర పడుతుంది. అందరూ 11, 12 అయితే గాని నిద్ర పోవడం లేదు. చివరకు పాలు త్రాగే చంటి పిల్లలు కూడా 11.30 గంటలకు టీవీలో అన్ని సీరియల్స్ అయ్యాక గాని పడుకోవడం లేదు. నిద్ర అంటే పూర్తి విశ్రాంతి. విశ్రాంతి తీసుకోవాలంటే శరీరానికి అన్ని పనులు పూర్తి కావాలి.
మీరు అలా అన్ని పనులు పూర్తి చేసి పడుకుంటే వెంటనే నిద్ర వస్తుంది. అలా మనం చేయడం లేదే! రాత్రి 10, 11 గంటలకు తిని పడుకొంటున్నాము. శరీరం పైకి పడుకుంటున్నది, కానీ లోపల అవయవాలన్నీ ఆ ఆహారాన్ని అరిగించే పనిలో ఉండిపోతాయి. మీరు పడుకున్నా శరీరం పనిలోనే ఉన్నది కాబట్టి మీకు వెంటనే నిద్ర రాదు. ఎందుకు రాలేదంటే అది పడుకోవాలనుకోవడం లేదు.
అదే మీరు ఆహారాన్ని పెందలకడనే తిని ఆహారం అరిగాక పడుకుంటే, వెంటనే మీ శరీరము, మనస్సు నిద్రలోనికి వెళతాయి. నేను చెప్పిన ఈ విషయాన్ని అందరూ ముందు ఒప్పుకోలేరు. 10 రోజులు ఆచరించి అప్పుడు చెప్పండి.
చిట్కాలు:
- ప్రతిరోజు 6, 6.30 గంటల కల్లా భోజనాన్ని తినడానికి ప్రయత్నించండి. 8, 10 రోజులు మాత్రం కొత్తలో రాత్రికి నిద్ర సరిగా రాకపోయినా, ఆ తరువాత మాత్రం 9, 10 గంటలకే ఆవలింతలు వచ్చి, నిద్రను ఆపుకోలేరు.
- శరీరం బడలిక వల్ల, కాళ్ళు, పాదాలు నొప్పులు ఉండి నిద్ర రాకపోతే పాదాలను వేడినీటిలో ముంచి కుర్చీలో కూర్చోండి. ఇలా 15, 20 నిమిషాలు ఉంచి పాదాలను తీసి చన్నీళ్ళలో కాళ్ళను కడుక్కుంటే మంచిది.
- ఎప్పుడన్నా ఆలోచనలు ఎక్కువగా వస్తూ నిద్ర రాకపోయినా, మనస్సు బాగోపోయినా కళ్ళల్లో ఒక చుక్క తేనె వేసుకుని పడుకోండి. తేనె వల్ల కంటిలో కొద్దిగా మండుతుంది. మీ మనస్సు ఆ ఆలోచనలను, బాధలను వదిలి వెంటనే ఈ మంట మీద కొస్తుంది. 5, 10 నిమిషాలలో మీరు అలా కంటిని గమనిస్తూ నిద్రలోనికి వెళ్ళిపోతారు. అప్పుల బాధ లెక్కువున్నాయని కంటిలో రోజూ తేనె వేసుకుని పడుకుంటే 5, 6 రోజుల తరువాత కంటికి తేనె అలవాటు అయ్యి ఇక చుర్ అనడం మానేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వేసుకోండి, నష్టమేమి ఉండదు.

0 Comments