దీనినే అసిడిటీ (Acidity) అని అంటుంటారు. భోజనం టైము అయినప్పుడు మంట వస్తే, కొందరికి ఖాళీ కడుపు మీద పరగడుపున మంటగా ఉంటుంది. కొందరికి తిన్నది అరిగాక ఉంటుంది. ఇంకొందరికి 24 గంటలూ అలా మండుతూనే ఉంటుంది.
పాలపొంగుపై నీళ్ళు చల్లితే పాలు ఉపశమించినట్లుగా మందులతో ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. పులుపుకి, కారానికి మంట వస్తున్నట్లుగా అనుకుని అందరూ వాటిని పూర్తిగా మానతారు. అది తప్పు. ఇవి రెండూ అసలు దొంగలు కావు. అసలైన వాటిని తెలుసుకుని మానండి తప్ప కారాన్ని, పులుపును మానినంత మాత్రాన కడుపులో మంటలు పోవు. లేనివి రాకుండా ఆగవు.
మంట వచ్చినప్పుడు అది తగ్గడానికి పంచదార నీళ్ళు, పాలు, చల్లటి పానీయాలు, ఏవైనా బిస్కెట్లు మొదలగునవి తింటే ఆ మంట తాత్కాలికంగా అరగంట తగ్గినా తరువాత రెట్టింపు అవుతుంది. ఇవి మంటను పెంచుతాయి. ఇవన్నీ యాసిడ్ ఎక్కువగా చేసే ఆహారాలు. వీటిని ఎసిడిక్ ఫుడ్స్ అంటారు. పాలు పొంగు రాకుండా చేసుకోవాలి గాని ఎంతసేపూ నీళ్ళు చల్లుకోవడం కాదు. పొట్టలో అదనంగా యాసిడ్ ఉత్పత్తి జరగకుండా జాగ్రత్త పడాలి.
మంట రావడానికి అందరూ చేసే తప్పులు:
- మంచినీళ్ళను తక్కువగా త్రాగడం వల్ల పొట్ట, ప్రేగులలో జిగురు ఉత్పత్తులు తగ్గి మంటలు రావచ్చు.
- టీ, కాఫీలు త్రాగేవారికి యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా వుండి వాటి నుండి రక్షించే జిగురు ఉత్పత్తులు సగానికి సగం తగ్గి పోతాయి.
- తినేటప్పుడు నీరు త్రాగడం వల్ల పొట్టలో యాసిడ్ పలుచగా అయ్యి ఆహారాన్ని సరిగా అరిగించలేదు. పొట్ట ఆహారాన్ని త్వరగా అరిగించడానికి ఎక్కువగా యాసిడ్ ను ఉత్పత్తి చేసి, ఈ పలుచగా ఉన్న యాసిడ్ గాఢతను పెంచే ప్రయత్నం చేస్తుంది. దానితో పొట్టలో మామూలు కంటే ఎక్కువ యాసిడ్ ఒక్కసారే ఊరడం వల్ల మంట ఎక్కువగా వస్తుంది.
- నొప్పులకు వాడే మాత్రల వల్ల జిగురు పొరలు పోతాయి.
- కోపాలు, చిరాకులు, టెన్షన్స్, పొట్లాటలు మొదలగునవి యాసిడ్ ఉత్పత్తిని పెంచి, జిగురు ఉత్పత్తిని తగ్గించడం వల్ల మంటలు వస్తాయి.
- క్రొవ్వు పదార్థాలు అయిన మాంసం, గుడ్లు, నూనె, నెయ్యి, పలావులు మొదలగునవి పొట్టలో ఆహారం లేనప్పుడు కూడా యాసిడ్ ఉత్పత్తి అయ్యేట్లుగా పొట్టను పాడు చేస్తాయి. ఇన్ని తప్పులు చేస్తూ కారాలు, పులుసులు మానితే ఏమి లాభం ఉంటుంది. ఎన్ని డబ్బులు పోసినా జబ్బు అలానే ఉంటున్నది.
చిట్కాలు:
- రోజూ త్రాగే 5 లీటర్ల నీటిని గోరువెచ్చగా చేసుకుని త్రాగాలి. గోరువెచ్చగా ఉన్న నీరు మంటకు విరుగుడుగా పనిచేస్తాయి.
- ఎప్పుడు మంట ఎక్కువగా ఉన్నా గోరువెచ్చని నీటిలో తేనె 3, 4 టీ స్పూన్లు కలిపి త్రాగితే వెంటనే మంటకు విరుగుడుగా పనిచేస్తుంది.
- టీ, కాఫీలను పూర్తిగా మానాలి.
- మంటకు వాడే మందులను పూర్తిగా మాని ఇలా ప్రారంభించడం మంచిది. మొదట 1, 2 రోజులు అత్యవసర పరిస్థితులలో అవసరమైతే మందు వాడుకోవచ్చు.
- ఎప్పుడు పడితే అప్పుడు, అస్తమానం ఏదొకటి నోటిలో వెయ్యడం మాని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మూడుసార్లే తింటూ, తిన్నప్పుడు పూర్తిగా తిని ఇక ఆపి వేయాలి. ఖాళీ కడుపు మీద యాసిడ్లు ఊరడం పూర్తిగా ఆగిపోతాయి. ఏదొకటి కొంచెం కొంచెం తింటే ఎప్పుడూ పనిపెట్టినట్లు అవుతుంది. అస్తమానం యాసిడ్ ఉత్పత్తి ఆగదు. మీ ఇంటికి గంటకొక చుట్టం వేళ కాని వేళ వస్తూ ఉంటే పని తెమలక ఎలా చిరాకుగా ఉంటుందో, పాపం పొట్టకు కూడా ఇన్నాళ్ళ నుండి అలానే ఉండి అవస్థ పడుతుంది. కాబట్టి, పొట్ట మీదని గ్రహించి అందులో జాగ్రత్తగా వేసుకోండి. మిమ్మల్ని అది సుఖంగా ఉండనిస్తుంది. 2, 3 రోజులలోనే హాయిగా మంట రాకుండా చేస్తుంది.

0 Comments