disadvantages of drinking tea and coffee

ఈ కాలంలో ఇది కాఫీ టైము, ఇది టీ టైము అని అందరికీ ఉంటున్నది. అంటే అంత టైము ప్రకారముగా మానకుండా వాటిని త్రాగేటట్లుగా మనిషి అలవాటు పడిపొయ్యాడు.

తెల్లదొరలు మన దేశాన్ని పాలించినప్పుడు, వాళ్ల అలవాట్లను మన వాళ్ళు నేర్చుకొని దాన్ని మానకుండా త్రాగుతూ, దేశమంతటా అంటువ్యాధి లాగా ఒకరికొకరు ముట్టించుకుని ఓనమాలు నేర్చుకోనివారి దగ్గర్నుండి, బాగా చదువుకున్నవారి వరకు అందరూ త్రాగుచున్నారు. 


కాఫీ, టీ లను త్రాగడాన్ని ఎవరూ దురలవాటుగా అనుకోరు. ఎవరూ దురలవాటని అనడం లేదు. మన దేశంలో బ్రాందీలు, విస్కీలు త్రాగితే దాన్ని దురలవాటుగా చెప్పుకుంటారు. అదే ఇతర దేశాలలో బ్రాందీలు, విస్కీలు త్రాగినా ఎవరూ దాన్ని దురలవాటు అని అనరు.
ఎందుకంటే అక్కడ ఆడ, మగ, పిల్ల, పెద్ద అందరూ కలిసి కూర్చుని త్రాగుతారు. ఇలా అందరూ త్రాగేవారే కాబట్టి ఇంక అది దురలవాటనే వారు ఎవరుంటారు? 

అదే మన దేశంలో అయితే బ్రాందీలను, విస్కీలను త్రాగేవారు 40, 50 శాతం మంది ఉంటే మిగతా వారు త్రాగడం లేదు కాబట్టి, వీరు అనడానికి మిగిలారు. అందుకని అది దురలవాటుగా పేరుపడింది.
మరి కాఫీ, టీ లు కూడా శరీరం పై అదే ప్రభావాన్ని చూపే వ్యసనాలు. అయినప్పటికీ కాఫీ, టీ లను దురలవాటుగా ఎందుకనటం లేదంటే, అందరూ త్రాగుతున్నారు కాబట్టి ఇక అనేవారెవరు. 
వాస్తవానికి కాఫీ, టీ లు కూడా సిగరెట్లు, గుట్కాలు, విస్కీలు, జరదా, కిళ్ళీల లాగా ఒక వ్యసనమే. వ్యసనము అంటే, కొన్ని రోజులు త్రాగాక అది త్రాగకుండా ఒక రోజు మానినపుడు, ఆ టైముకి మీరు మరిచినా అది మరవకుండా త్రాగమని గుర్తు చేస్తూ వుంటుంది. 
మీరు సంవత్సరం పాటు రోజూ ఒక టైము ప్రకారం మజ్జిగ త్రాగి, ఎప్పుడన్నా ఒక్క రోజు మాని చూడండి. ఆ టైముకు మీరు మజ్జిగ త్రాగలేదని మీ శరీరము ఇబ్బంది పడుతుందేమో. 
ఇది ఆహార పదార్థము కాబట్టి అలా ఇబ్బంది అనిపించదు. మరి టీ, కాఫీలు ఆహార పదార్థాలా? ప్రతి రోజూ ఎన్నోసార్లు, ఎంతమంది కొరకో త్రాగుచున్నాము. ఎంతమందికో మన చేతులతో ఇస్తున్నాము. అవి మందు పదార్థాలు తప్ప ఆహారం కాదు. టీ, కాఫీలలో ఏముంటుందో చూద్దాము.
ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే మందు ఉంటుంది. ఒక కప్పు టీ లో 150 మిల్లీ గ్రాముల టీన్ అనే మందు ఉంటుంది. ఈ రెండు మందులను నరాల సంబంధించి, రక్త నాళాల సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పుడు వాడితే వాటిని తగ్గించుకోవాడానికి పనిచేస్తాయి. 
ఎవరికన్నా నరాల, రక్తనాళాల ఇబ్బందులు వచ్చినప్పుడు, వైద్యులు ఆ నరాలు చురుగ్గా పనిచేయడానికి ఈ మందులను వాడతారు. మనం రోజులో ఒక కప్పు కాఫీ గానీ, టీ గానీ త్రాగితే, నరాలకు సంబంధించి 150 మిల్లిగ్రాముల టాబ్లెట్ వేసుకున్నట్లే. 
ఎవరైనా కొందరు కాఫీ చెడ్డది, టీ మంచిది అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ రెండూ ఒకే జాతి. అక్కాచెల్లెళ్ళు. అంతే భేదం. మనం రోజుకి ఎన్ని కప్పులు త్రాగుతున్నాము? అంటే, కొందరు 10, 12 కప్పులని, మరి కొందరు 5, 6 సార్లని ఇలా లెక్క వస్తుంది. 
ఈ విధముగా రోజు మొత్తంలో ఆ మందును ఎంత ఎక్కువగా మనలోకి పంపుతున్నామో ఆలోచించండి. ఇలా ఒక్క రోజా లేదా రెండు రోజులా? ఎన్ని సంవత్సరాల నుండి ఈ శరీరాన్ని ఆ ఉద్రేకపరిచే పదార్థాలతో ఇబ్బంది పెడుతున్నాము కదా! 
కాఫీ, టీ లు త్రాగిన తరువాత మనలో ఏమి జరుగుతుందో చూద్దాము. మాములుగా మనలోని నరాలు సమస్థితిలో పనిచేసుకుంటూ ఉంటాయి. 
మీరు కాఫీ, టీ లను త్రాగిన అరగంటలో అందులోని మందు మీలో పనిచెయ్యడం మొదలు పెడుతుంది. కెఫిన్, టీన్ ల ప్రభావం వలన మనలోని నరాల వ్యవస్థ ఒక్కసారే చురుగ్గా, ఉషారుగా పని చెయ్యడం ప్రారంభిస్తుంది. మాములుగా నడిచే ఎద్దు కొరడా దెబ్బ వేస్తే స్పీడ్ గా పరిగెత్తినట్లుగా మనలో నరాలు కూడా అలానే పనిచేస్తూ ఉంటాయి. 
ఇలా ఆ పవరు సుమారుగా 2, 3 గంటల పాటు మనలో ఉంటుంది. ఆ పవరు పనిచేసినంత సేపు మీరు మరీ హుషారుగా, చురుగ్గా మనస్సు తేలికగా చక చకా చేసుకుందామనే ఊపులో ఉంటారు. 
ఇలా ఉంటే మంచిదేగదా అని మీరు అనవచ్చు. పరుగెత్తిన ఎద్దు కొంతసేపటికి అలుపు వచ్చి మాములుగా నడిచే నడక కూడా నడవకుండా, దున్నపోతు నడకకు తగ్గిపోతుంది. అలాగే మనలో కూడా నరాలు సహజ స్థితిలో పనిచేయాల్సింది పోయి మరీ దిగజారిపోయి పని చేస్తుంటాయి. 
అలాంటప్పుడు మీకు నీరసంగా, బద్దకంగా, హుషారు తగ్గిపోయి నట్లుగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం మళ్లీ నాకు కాఫీ కావాలని లేదా టీ కావాలని గుర్తు చేస్తూ ఉంటుంది. 
ఆ టైముకి శరీరం అడిగినా మీరు అందివ్వకపోతే మీకు వెంటనే తలనొప్పిగా మనస్సు పనిచెయ్యనట్లుగా అనిపించి నీరసంగా అయిపోతారు. అందుకే మీకు కాఫీ, టీ ల టైము అయినప్పుడు ఎక్కడున్నా ముందు వాటిని త్రాగేవరకు తోచదు. 
ఈ అలవాట్లు శరీరాన్ని, మనస్సును దిగజారిపోయేట్లు చేస్తాయి. అందుకే వీటిని దురలవాట్లు అన్నారు. ఉత్తి పుణ్యానికి మామూలుగా పనిచేసే నరాలను ఉద్రేకపరచడమెందుకు, ఆ పై మనము ఇబ్బందులు పడటమెందుకు? మనిషి అంటే, ఎప్పుడూ సమస్థితిలో ఉండవలసినవాడు. అంతేగానీ, రోజూ శరీరాన్ని, మనస్సును ఉద్రేకపరుచుకునేవాడు కాదు.

కాఫీ, టీలను త్రాగడం వల్ల నష్టాలు

  1. ప్రేగులపై వీటి ప్రభావం పడి ఆహారం మీద వాంఛ పోతుంది. ఆకలి చావడం అందరికీ అనుభవమే.
  2. పొట్ట, ప్రేగులలో మంటలను, పూతలను రాకుండా ఒక రకమైన జిగురు పదార్థం కాపాడుతుంది. ఆ జిగురును పుట్టించే గ్లోబ్లెట్ కణాలపై వీటి ప్రభావం పడి ఆ జిగురు ఉత్పత్తిని సగానికి సగం తగ్గించివేస్తాయి. దాంతో కడుపులో మంటలు, ప్రేగుపూతలు, అల్సర్స్ మొదలగునవి వస్తాయి. మనం ఈ సమస్యలు వచ్చినప్పుడు కారాలను, పులుపులను మానుతున్నామే గాని, టీ, కాఫీలను మానము. ఆ సమస్యలు అందుకే పూర్తిగా తగ్గడం లేదు.
  3. పొట్ట, ప్రేగులలో ఆహారాన్ని అరిగించడానికి ఎన్నో ఎంజైములు ఊరతాయి. ఇవి వాటి ఉత్పత్తిని తగ్గించివేస్తాయి.
  4. నరాలు ఎక్కువగా ఉద్రేకపడి పని చేస్తున్నందుకు త్వరగా అలసటకు గురి అవుతాయి.
  5. కాఫీ, టీ ల పవరు, మనలో అయిపోయినపుడు మనం వాటిని మళ్లీ త్రాగకపోతే వెంటనే తలనొప్పులొస్తాయి. అలా అలవాటు అయిన తలనొప్పులు రోజులో ఏదో ఒక టైములో వస్తూనే ఉంటాయి. 50, 60 శాతం తలనొప్పులకు కాఫీ, టీ లే కారణాలు అని అనవచ్చు.
  6. కాఫీ, టీ లు కిడ్నీల పై ఉండే ఎడ్రినల్ గ్రంథులపై పనిచేసి కొంచెం కొంచెం మూత్రం ఎక్కువ సార్లుగా పోసి అతి మూత్ర వ్యాధి వచ్చేట్లుగా చేస్తాయి.
  7. మన లివరుకు, ప్రతి రోజూ ఒక కప్పు త్రాగినందుకు వచ్చిన దోషాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజు పడుతుంది. మనం రోజుకి 5, 6 కప్పులు త్రాగితే మిగతా కప్పులలో మందు ప్రభావాన్ని శుద్ధి చేయలేక లివరుకు సమస్యగా మారుతుంది.
  8. మెదడును ఎక్కువగా పని చేయించడం చేత ఎక్కువగా ఆలోచనలు రావడం, స్థిరంగా లేనట్లుగా అనిపించడం, చిరాకుగా ఉండడం జరుగుతుంది.
  9. నరాలు ఎప్పుడూ ఉద్రేకం లో ఉండడం వల్ల రిలాక్సు కావు. దానితో సరిగా నిద్రరాదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు.
  10. ప్రొద్దున్నే కాఫీ, టీ లు త్రాగడం వల్ల మన శరీరానికి విసర్జన క్రియ ఆగిపోతుంది. పరగడుపున మన శరీరం మనలో ఉన్న చెడును క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇవి త్రాగిన వెంటనే ఆ చెడు వదిలే కార్యక్రమాన్ని ఆపి సడన్ గా ఉద్రేకపడి ఈ గొడవలో పడిపోతుంది.
కాలక్షేపానికి త్రాగే కాఫీ, టీ లలో ఏముందో తెలుసుకోకుండా, ఎన్నాళ్ళగానో ఈ శరీరాన్ని ఏడిపిస్తూ వస్తున్నాము. కాలక్షేపానికి మీ ఇంటికి కాస్త బురద పూసుకుంటారా? మీ కారు ఆయిల్ టాంకు లో కాస్త ఇసుక పోసుకుంటారా? అలా చెయ్యరే! మరి ఎన్నో కోట్లు పోసినా కొనలేని ఈ శరీరం లో కాలక్షేపానికి అలాంటి చెత్తను ఎందుకు పోస్తున్నారు? 
పైగా ఒక రకంగా కాదు. మన కోసం ఒకసారి, బంధువుల కిచ్చి వారికి తోడుగా మరోసారి, ఏమీ ఊసిపోక ఇంకొకసారి, ఊరికే వచ్చిందనో, స్నేహితుల కొరకో ఇలా రోజుకి ఎన్నిసార్లు ఇలా ఈ శరీరాన్ని ఔషధమయం చేస్తున్నారు. 
ఇది మన శరీరము. మన సుఖము కొరకే పనిచేస్తుంది. కాబట్టి ఇక అలాంటి టీ, కాఫీల సాంప్రదాయాలను పూర్తిగా వదిలివేయండి. మీ ఇంటికి బంధువులొచ్చినా గానీ ఇవ్వకండి. ఏం ఆశ్చర్యంగా ఉందా? లేదా ఇంకొకసారి రారని అనుమానమా? మనం బాగుపడి నలుగురినీ బాగుచెయ్యాలి గానీ, మనం చెడిపోయి నలుగురినీ చెడగొట్టకూడదు గదా! 
కాఫీ, టీ లను మానినప్పుడు మొదటి 5, 6 రోజులపాటు మనసు, నోరు లాగేస్తూ ఉంటాయి. వాటిపై వాంఛను పొగొట్టుకోవడానికి మానిన రోజు నుండి మీరు గోరువెచ్చని నీటిలో ఒకటి, రెండు నిమ్మకాయల రసాన్ని పిండి (కావాలంటే 1, 2 స్పూన్లు తేనె) పుల్లగా ఉండేటట్లుగా త్రాగండి. ఎప్పుడైతే నోరు పుల్లగా అవుతుందో వాటి మీద వాంఛ పోతుంది. పులుపుకు ఆ గుణం ఉన్నది. రోజుకి అలా 2, 3 సార్లు త్రాగవచ్చు. 
వీటిని మానినందుకు తలనొప్పిగా ఉంటే రెండు పూటలా తలస్నానం చన్నీళ్లతో చేయండి. అత్యవసరమైతే నొప్పికి మాత్రలు వేసుకోవచ్చు. వారం రోజుల్లోనే మీ శరీరం వాటి స్నేహాన్ని మరువగలదు. ఒక్కసారి పూర్తిగా మానితే ఇక మళ్లీ జీవితంలో వాటిని ఎవరి కొరకు త్రాగకండి. 
అసలు కాఫీ, టీ లు ఎవరికి వారు త్రాగేదానికంటే నలుగురి గురించి త్రాగడమే ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసమో మన జీవితాన్ని పణంగా పెట్టవద్దు. కాఫీ, టీ ల బదులుగా పాలు కూడా వద్దు. పాలు త్రాగే వయస్సు దాటిపోయింది. 
కాబట్టి ఆ టైములో పుల్లటి పండ్ల రసంలో, తేనె నిమ్మరసం నీళ్లో, చెరుకురసమో, కొబ్బరి నీళ్ళో మొదలగు వాటిని మంచి అలవాట్లుగా మార్చుకుంటే జీవితం మంచిగా ఉంటుంది. మనం మంచిగా అవ్వడానికి ప్రయత్నిద్దాం.
మీ మిత్రులకు ఈ పోస్టుని షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. ధన్యవాదాలు.