మన దేశంలో రాజకీయం అంత ఒకే వ్యక్తిమీద కేంద్రీకృతమై జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి కేంద్రంలో మన ప్రధాని మోడీ గారు, ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలలో కెసిఆర్, చంద్రబాబు, జగన్ బాబు, కళ్యాణ్ బాబు, బెంగాల్ లో మమతా దీదీ, ఇలా ఒక్కో రాష్ట్రంలో ప్రతీ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని చూసి మనం ఓటు వేస్తాం.
ఫలానా వ్యక్తి అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అని మన భావన. అంతే కానీ మన నియోజికవర్గంలో ఎవరు నిలబడుతున్నారు? MLA అయ్యాక ఆ వ్యక్తి మన నియోజికవర్గ సమస్యలు పరిష్కరిస్తారా లేదా? అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది.
CM లేదా PM అయిన వ్యక్తే మన సమస్యలన్నీ తీరుస్తారు అని మనం గుడ్డిగా నమ్ముతాం. కాని మనది చాలా పెద్ద దేశం. రాష్ట్రాలు కూడా చాలా పెద్దవి. కొన్ని రాష్ట్రలైతే కొన్ని దేశాలకన్నా పెద్దవి. అంతే కాకుండా మన జనాభా కూడా చాలా చాలా ఎక్కువ. ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల జనాభాకి వచ్చే సమస్యలు ఒక్క CM కానీ PM కానీ తీర్చలేరు.
CM, PM పెద్ద సమస్యలు, ఎక్కువమందిని ప్రభావితం చేసే సమస్యలమీదే ఎక్కువ ద్రుష్టి పెడతారు. ఉదాహరణకి పేదరిక నిర్మూలన, రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య లాంటివి.
మరి మనం రోజు ఎదుర్కునే సమస్యలు అంటే మన కాలనీలలో మంచి నీటి సమస్య, రోడ్లు వేయించడం మొదలైన సమస్యలు పరిష్కరించేది మన MLA, MP గారు మాత్రమే.
నియోజిక వర్గాలు స్వతంత్రంగా అభివృద్ధి చెందితే దేశం కూడా ముందుకు దూసుకెళ్తుంది. అలాంటి నియోజికవర్గ బాధ్యతలు చేపట్టే MP/MLA కి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
1. నియోజికవర్గం సమస్యల మీద పూర్తి అవగాహన
మనం నివసించే ప్రాంతంలో మనం కొన్ని సమస్యలు ఎదుర్కుంటూ ఉంటాం. ఉదాహరణకి మన ఊరిలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లేకపోవడం, రోడ్లు బాలేకపోవడం, ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడం, బస్సు సదుపాయం లేకపోవడం లాంటివి. ఇవే కాకుండా అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు అన్ని పదవి కోసం పోటీ పడే అభ్యర్దులకు తెలిసి ఉండాలి.
నియోజికవర్గంలో అనేక ఊర్లు ఉంటాయి. ప్రతీ ఊరికి అనేక సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యల మీద నాయకుడికి అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే సమస్య ఏంటో తెలియకపోతే పరిష్కారం ఎలా చేస్తారు?
2. సమస్యలు పరిష్కారం చేయగల తెలివి
సమస్య ఏంటో తెలిసాక దాన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా పరిష్కరించగల చతురత రాజకీయ నాయకులకు ఉండాలి. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవ్వగలవు. కొన్ని చాలా జటిలంగా ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా నాయకులు పరిష్కరించాగలగాలి.
మన నియోజికవర్గ సమస్యలు పరిష్కరించడానికి పక్కా వ్యూహంతో వచ్చే నాయకుడ్నే మనం ఎన్నుకోవాలి.
స్తానికి ప్రజలను, ప్రభుత్వ అధికారులను సమన్వయ పరుస్తూ మన సమస్యలను నాయకులు తీర్చగలగాలి.
![]() |
3. ప్రభుత్వ కార్యాలయాల విధానాల మీద పూర్తి అవగాహన
ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చాలా ఆలస్యంగా జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎలాంటి లోపాయకారి చర్యలకు పాల్పడకుండా ఎన్నో నియమాలకు కట్టుబడి పని చెయ్యాల్సి ఉంటుంది. ఒక పనికి ఎంతో మంది అధికారుల చేతులమీదగా జరగాల్సి ఉంటుంది. ( ఎన్ని నియమాలు ఉన్నా వాటి ఉల్లంఘన జరుగుతూనే ఉండటం వేరే విషయం అనుకోండి)
ఇలా ఒక పని ప్రభుత్వ అధికారులతో చేయించగలగాలంటే, ప్రభుత్వ కార్యాలయాల విధివిధానాల మీద రాజకీయ నాయకుడికి పూర్తి అవగాహన ఉండాలి.
ఎందుకంటే అవగాహన లేని నాయకుడిని ప్రభుత్వ అధికారులు ఊర్కెనే బురిడీ కొట్టించగలరు. సులువుగా అయిపోయే పని కూడా అధికారుల అలసత్వం వల్లనో, ఇతరత్రా కారణాల వల్ల ఏళ్లతరబడి అవ్వకుండా ఉండిపోతాయి.
అవగాహన ఉన్న నాయకుడు అధికారులను నిలదీసి మరీ పని చేయించగలరు. కేవలం అధికారం ఉంది కదా అని నాయకులు అధికారులచేత పని చేయించలేరు. రూల్ తెలిసి, నియమాలు అతిక్రమించకుండా సమస్యను నాయకులు పరిష్కరించగలగాలి.
ఇది ప్రతీ రాజకీయ నాయకుడికి ఉండవలసిన చాలా ముఖ్యమైన లక్షణం.
4. ప్రజలకు అందుబాటులో ఉండడం
చాలా మంది రాజకీయ నాయకులకు తమ సొంత వ్యాపారాలు ఉంటాయి. నాయకులు తమ వ్యాపారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి నియోజికవర్గాన్ని గాలికి వదిలేస్తారు. అలాంటప్పుడు ఆ నియోజికవర్గం అభివృద్ధి కుంటుపడుతుంది.

నాయకులు ప్రజలతో కేవలం ఎన్నికలప్పుడే కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి ప్రజలను కలుస్తూ ఉండాలి. ఇలా ఎదురు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించే వారిని మనం ఎన్నుకోవాలి.
5. నియోజికవర్గ అభివృద్ధికి ప్రణాళిక
ప్రభుత్వంలో ఉండే నాయకులకు కొత్తగా వచ్చే పరిశ్రమలు కానీ, సంక్షేమ పధకాల గురించి కాని ముందే తెలిసి ఉంటుంది.
ముందుగ అవగాహన ఉండే నాయకులు ఆ కొత్త పరిశ్రమలు తమ నియోజికవర్గంలోకే వచ్చేలా చేయడానికి నియోజికవర్గాన్ని సిద్ధంగా ఉంచాలి.

నియోజికవర్గ యువతను ఇలా పరిశ్రమల్లో పనిచేయడానికి సిద్ధం చెయ్యాలి.
పరిశ్రమల ఏర్పాటుకు వృధాగా పడి ఉండే ప్రభుత్వ భూములను గుర్తించి, పరిశ్రమకి కావలసిన కనీస వసతులు ఆ భూములకు సమకూర్చాలి.
సంక్షేమ పధకాల అమలు 100% జరిగేలా చూసుకోగలగాలి. సంక్షేమ ఫలాలు పొందడానికి ప్రజలకు అవగాహన కలిపించాలి.
పేదరికంనుండి నియోజికవర్గ ప్రజలు బయట పడేలా ప్రణాళికలతో నాయకులు ముందుకి రావాలి.
అందరికి విద్య అందేలా స్కూళ్ళు, కాలేజీలు తెప్పించగాలగాలి.
అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆసుపత్రులు కట్టించాలి.
ఉద్యోగ కల్పనకోసం పరిశ్రమలు రప్పించాలి.
రైతులు సాంకేతికతను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి.
ఇలా ఒక నియోజికవర్గం సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేసే నాయకుడ్ని మనం ఎన్నుకోవాలి.
ఇవే కాకుండా ఇంకా ఏవైనా ముఖ్యమైన లక్షణాలు మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి.
ఈ పోస్టును అందరితో చదివించి మంచి నాయకులను తయారుచెయ్యడంలో సహాయ పడండి.
మీ
YY.



0 Comments