Feb 14 న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. Feb 26 న ఉదయం 3-4 మధ్య పాకిస్తాన్ లోని బాలకోట్ ప్రాంతంలో భారతీయ వాయుసేన దాడిచేసి 350 కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.


ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదని ముందు నుంచి చెబుతున్న భారత్‌, సరైన సమయంలో, కచ్చితమైన ప్రణాళికతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది.

ఈ దాడి జరపడానికి భారత్‌ ఎంచుకున్న ప్రాంతం పాక్‌లోని బాలాకోట్‌. ఉగ్రవాదులకు పాక్‌లోని పలు ప్రాంతాల్లో శిబిరాలు ఉన్నాయి. అలాంటప్పుడు భారత్ బాలకోట్ నే ఎందుకు ఎంచుకుంది?

భారత్‌ ప్రధానంగా బాలాకోట్‌లో మాత్రమే భారత్ దాడి చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆత్మాహుతి దాడులు జరపడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించుకునే కీలక స్థావరం ఇది. 

బాలాకోట్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటుంది. దట్టమైన అడవి మధ్య ఉండే కొండలపై ఉగ్రవాదులు ఉంటారు.

ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. కొత్తవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు.

ప్రస్తుతం బాలాకోట్‌లో జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులు ఉంటున్నారు. మసూద్‌ అజర్‌ ఈ సంస్థను స్థాపించకముందు ఈ ప్రాంతాన్ని హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు వినియోగించుకున్నారు.


ఆయుధాలను ఉపయోగించే విధానం, ఆత్మాహుతి దాడులు చేయడం వంటి వాటిల్లో ఆ దేశ ఆర్మీ మాజీ అధికారులే శిక్షణ ఇస్తారు. అధునాతన ఆయుధాలను ఎలా ఉపయోగించాలి? ప్రణాళికబద్ధంగా కాన్వాయ్‌లపై ఎలా దాడి చేయాలి? పేలుడు పదార్థాలను ఎలా వినియోగించాలి? ఆత్మాహుతి దాడులకు ఎలా పాల్పడాలి? ఇందుకోసం ఎలా సిద్ధమవ్వాలి? అనే అంశాలన్నింటిపైనా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతారు.

ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే ఈ కీలక స్థావరంపై దాడి చేసిన భారత్‌.. జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్ర సంస్థ ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది.

కున్హార్‌ నదీకి దగ్గరలో బాలాకోట్‌ ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి. ఉగ్రవాదులకు అన్ని రకాలుగా శిక్షణ లభిస్తోంది. ఇంత పెద్ద ఉగ్రస్థావరం ఆ ప్రాంతంలో ఉంటే ఈ విషయం గురించి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కి తెలియకుండా ఉంటుందా? అని భారత్‌ ప్రశ్నిస్తోంది.



బాలాకోట్ జైషే ఉగ్ర స్థావరం ఉన్న చోటుకి యుద్ధ విమానాలు వెళ్తే పాక్‌ రాడార్లు గుర్తిస్తాయి. ఈ విషయంపై దృష్టిపెట్టిన వాయుసేన సాంకేతికతను వినియోగించుకుంది. అవి పనిచేయకుండా ఉండేందుకు అధిక సామర్థ్యం గల జామర్లను వెంట తీసుకెళ్లింది. లేజర్‌ ద్వారా స్థావరాలను గుర్తించి దాడులు జరిపింది. దీంతో భారత విమానాలు సురక్షితంగా తిరిగి రాగలిగాయి.