చర్మంలోని చెమట గ్రంథులు స్రవించే సీబమ్ అనే పదార్థము చర్మంపై చేరిన బాక్టీరియాతో కొన్ని రసాయనిక చర్యలకు లోనుకావడం వలన వెంట్రుకల కుదుళ్ళు ఒక లాంటి ఇన్ ఫెక్షన్ కి గురి అవుతాయి. సీబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసే సెబేసియస్ నాళాలు పూడుకుని పోతాయి. దీని ఫలితంగా లోపల నుండి గట్టి పొక్కులు నలుపు లేదా తెలుపు కొసలతో తయారవుతాయి. వీటినే మొటిమలు అంటారు.
మలబద్ధకం బాగా వున్నవారికి కూడా చర్మంలో వ్యర్థపదార్థాలు ఎక్కువగా పేరుకుని మొటిమలు ఇంకా పెరుగుతాయి. నీరు తక్కువగా త్రాగేవారికి కూడా చర్మం శుభ్రంగాక మొటిమలు వచ్చే అవకాశముంటుంది.
చిట్కాలు:
  1. మొటిమలను గిల్లడం గాని, పిండడం గాని చేయవద్దు. ఇలా చేస్తే మచ్చలు లేదా గుంటలు పడతాయి.
  2. ముఖానికి పై పూతల మందులు రాయడం మానండి. సబ్బులు కూడా మాని, ముఖాన్ని సున్నిపిండితో గాని, మెత్తటి గుడ్డతో గాని రుద్దుకోండి.
  3. నల్లటి మట్టిని తెచ్చుకుని దానిని మెత్తగా పొడి చేసి, దానిలో తుక్కు తీసి, దానిని ఎండలో 2, 3 రోజులు ఎండ బెట్టి ఆ మట్టిని పూతకు వాడుకోవచ్చు. ఆ బాగు చేసిన మట్టిని నీటిలో కొంత వేసి 1, 2 రోజులు నాననిచ్చి ఆ చల్లటి మట్టిని వాడుకోవాలి. ముఖానికి కొద్దిగా నిమ్మరసం, కొబ్బరినూనె (కొద్దిగా) కలిపి రాసి ముందు బాగా మర్ధన చేసి, ఆ తరువాత ఆ చల్లటి మట్టిని ముఖభాగంపై, మొటిమల భాగంపై పట్టిన మందాన్ని పూయండి. ఆ మట్టిని అలా 20, 25 నిమిషాలు ఉంచుకుని, కడిగి వేయవచ్చు. మట్టిని వేయడం వల్ల, మర్ధన వల్ల చర్మ రంధ్రాలలో పేరుకున్న చెత్త అంతా శుభ్రం అవుతుంది. ఇలా రోజూ ఒకసారి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది. పౌడర్ లు కూడా రాయక పోతే మంచిది. ముఖం నలుపుగా అయినవారు కూడా రంగు రావడానికి ఇలా మట్టి రోజూ వేసుకుంటే మంచిది. చర్మం మంచి కాంతిగా తయారవుతుంది. కాకపోతే మట్టి వేసుకుని ఇళ్ళలో తిరిగే పని చేస్తూ ఉంటే లేదా కాలక్షేపానికి టి.వి. వద్ద కూర్చున్నా ఏ పిల్లలన్నా చూస్తే దడుచుకుని జ్వరం కూడా వస్తుంది.
  4. మంచి నీటిని 4, 5 లీటర్లు త్రాగితే మంచిది.
  5. ఉదయం క్యారెట్ జ్యూస్, సాయంకాలం పండ్ల రసాలు త్రాగితే చర్మంపై మచ్చలు త్వరగా మాని మంచి రంగు వస్తుంది. వీటివల్ల రక్తంలో దోషాలు కూడా పోతాయి.
  6. విరేచనం సాఫీగా అయ్యేట్లు జాగ్రత్త పడండి.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.