ప్రయాణం అంటేనే అది ఒక సరదా. ఆ సరదాలో ఇంకొక సరదా, రకరకాలుగా చేసుకుని, కూడా తీసుకుని వెళ్ళి, ఆ ప్రయాణంలో అటూ ఇటూ చూస్తూ వచ్చేవారిని, పోయేవారిని పరిశీలిస్తూ ఎగరేస్తుంటే అసలు ప్రయాణం చేస్తున్నట్లే తెలియదు. అప్పుడే మన ఊరొచ్చేసిందా అనిపిస్తుంది. నీళ్ళు త్రాగితే మూత్రం వస్తుందని అవి త్రాగకుండా, అంతా తినే పనే.
ఇంటికి వెళ్ళేసరికి ముఖం పీక్కుపోయి, కళ్ళు గుంటలు పడి, నల్లగా తయారయ్యి నీరసంగా అయిపోతారు. ఇంటికి వెళ్ళి నాకు వేడి చేసింది, నాకు బస్సు పడలేదు లేదా కారు పడలేదని అంటారు. నేను రైల్లో మూత్రం పోసుకున్నా, అందుకే అప్పట్నుంచీ నాకు ఇన్ ఫెక్షన్ వచ్చి మూత్రం మంటగా ఉంది అని అంటారు. ఇలా మనం చేసే తప్పులు తెలుసుకోలేక అన్నింటి మీదా నిందలు వేస్తుంటాము.
బస్సు, రైలు, కారు ప్రయాణాలలో అద్దాల నుండి గాలి స్పీడ్ గా వచ్చి మనకు తగులుతూ ఉంటుంది. ఆ గాలికి మన లోపల నీరు ఎక్కువగా (ఫ్యాన్ గాలికి ఇంట్లో నేల త్వరగా ఆరిపోయినట్లు) ఆవిరై పోతుంటుంది. సుమారుగా గంటకు అరగ్లాసు పైన ఖర్చు అయిపోతూ ఉంటాయి. మనం ఎక్కడ నీరు త్రాగితే మూత్రం వస్తుందోనని అసలు త్రాగం. తినేదేమో నీటి అవసరాన్ని ఎక్కువగా ఖర్చు చేసే ఆహారం. గాలికి నీరు ఆవిరై లోపల నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. దాని వల్లే తలనొప్పులు, మాడు నొప్పులు, వేడి చేసినట్లుగా ఉండడం, గొంతు ఎండి పోవడం, గొంతు ఇన్ ఫెక్షన్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువ రోజులు ప్రయాణం చేసినపుడు తేడా రాకుండా ఉండాలంటే.
చిట్కాలు:
- నీటి సీసా దగ్గర ఉంచుకుని ప్రయాణం ప్రారంభించాలి. పొట్టలో ఆహారం కొంచెం ఖాళీ అయినప్పటి నుండి నీటిని 40, 50 నిమిషాలకు అరగ్లాసు లేదా ముప్పావు గ్లాసు చొప్పున త్రాగుతూ ఉంటే మీకు మూత్రం రాదు. త్రాగిన నీరు త్రాగినట్లు శరీర అవసరాలకు లోపల సరిపోతుంది. మీకు తేడాలు రాకుండా ఉంటాయి.
- ప్రయాణాలలో ఎక్కువ పండ్లను వాడుకోవడం అలవాటుగా చేసుకోండి.
- చిల్లర తిండ్లు తిన్నా తప్పు లేదు గాని అస్తమానం అదే రందిగా తింటే తేడాలు వస్తాయి. నీరు మిమ్మల్ని రక్షించినట్లుగా ఏదీ ప్రయాణంలో రక్షించదు కాబట్టి జాగ్రత్తగా త్రాగండి.

0 Comments