ప్లాస్మా ట్రీట్మెంట్, కరోనా పేషెంట్లకు ఇప్పుడిదొక ఆశాదీపం. వైరస్ వచ్చి బాగా సీరియస్ అయిన పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఖచ్చితంగా పని చేస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మన దగ్గరే కాదు, బయట దేశాల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. సౌత్ కొరియా దేశంలో ఈ పద్ధతి ద్వారా ఇద్దరు వృద్దులు పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్ళారని అక్కడి వార్తా చానల్లు పేర్కొన్నాయి.
కోవిడ్-19 రోగులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 1,500కు పైగా ఆస్పత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. బ్రిటన్‌లోనూ శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించే పనిలో ఉన్నారు. అందుకోసం దాతల నుంచి ప్లాస్మా సేకరిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్లాస్మా ట్రీట్మెంట్ కు సిద్ధమవుతున్నారు.
ప్లాస్మా ట్రీట్మెంట్ చాలా సులువైన ప్రక్రియ. వైరస్ వచ్చి కోలుకున్న వారి నుంచి 14 రోజుల తర్వాత ఈ ప్లాస్మా తీసుకుంటారు. రక్తాన్ని తీసుకొని అందులోనుంచి ఎర్ర, తెల్ల రక్త కణాలను వేరు చేస్తారు. మిగిలిన దాన్ని ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో వైరస్ ను ఎదుర్కునే యాంటీబాడీలు ఉంటాయి అని పరిశోధనల్లో తేలిన నిజం.
కరోనా వచ్చి కోలుకున్న వారిలో ఆ వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీస్ తయారై ఉంటాయి.
కాబట్టి ప్రస్తుతం కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వెంటిలేటర్పై ఉండేవారికి, కోలుకున్న వారి ప్లాస్మా ఎక్కిస్తే, వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెంది వైరస్ ను నిరోధించవచ్చని డాక్టర్ల మాట.
ఒక పేషెంట్ కు ఈ కరోనా జబ్బు వచ్చి రికవర్ అయిన రెండు వారాల తర్వాత ఆ పేషెంట్ రక్తాన్ని తీసుకొని దాంట్లో నుంచి ఎర్రరక్తకణాలను, తెల్లరక్తకణాలను వేరు చేస్తే మిగిలిన దాన్ని ప్లాస్మా అంటారు. ప్లాస్మా ఇచ్చే దాత కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకోవాలి. ఒకటి రెండు సార్లు పరీక్షలు చేసి వారి శరీరంలో వైరస్ లేదని వైద్యులు నిర్ధరించాలి.
ఆ తర్వాత 14 రోజులు గడిచాక, వారిలో రోగనిరోధక కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ఎలీసా పరీక్ష చేస్తారు. అంతా బాగుందని తేలితే, అప్పుడు వారి నుంచి ప్లాస్మాను తీసుకోవాల్సి ఉంటుంది.
కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసుకునే ముందు, వారి రక్తం స్వచ్ఛతను వైద్య నిపుణులు పరిశీలిస్తారు. అందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.
| ప్లాస్మా ను సేకరించే యంత్రం |
ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తర్వాత, వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది.
ప్లాస్మాలో మాత్రమే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీస్తారు. దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున, నలుగురు రోగులకు ఎక్కించవచ్చు. ఇలా సేకరించిన ప్లాస్మాని వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఎక్కించాలనేది వైద్యుల ఆలోచన.
![]() |
| రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మా |
కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి, మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదు.
వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు కూడా దీనిని వాడారు.
ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్ సహా, 2009లో వచ్చిన హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు.
ఈ ప్రక్రియ విజయం సాధిస్తుందన్నది వైద్యుల నమ్మకం, వారి కృషి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వ్యాసాన్ని మీ మిత్రులతో షేర్ చేసి వారి భయాన్ని తొలగించండి.




0 Comments