మనలో చాలా మందికి ఈ
ఆలోచన వచ్చే ఉంటుంది, "అసలు ఈ బ్యాంకులు
అకస్మాత్తుగా చార్జీలు ఎందుకు పెంచుతున్నాయి?" అని.
నిన్న మొన్నటిదాకా నోట్ల మార్పిడి జరిగి, నానా తంటాలు పడ్డాం .
మళ్ళీ ఇంతలోనే బ్యాంకులు చార్జీల రూపంలో మన దగ్గర ఫీజులు బాదుతున్నారు. అసలు
ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనుక ఏమైనా శాస్త్రీయమైన కారణం ఉందా? లేక ఋణాలు తిరిగి
రాబట్టుకోలేక ఆ డబ్బులన్నీ మన దగ్గర వసూలు చేస్తున్నారా?
సగటు మనిషికి వచ్చే అనుమానాలు తీర్చే చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
![]() |
| లేపాక్షి కలెక్షన్ |
నిరర్ధక
ఆస్తులు (Non Performing Assets)
బ్యాంకులు ఋణాలు ఇవ్వడం ద్వారా తమ వ్యాపారాన్ని
నడిపిస్తాయని మన అందరికకీ తెలిసిన విషయమే. ఇలా
ఇచ్చిన ఋణాలు అందరూ నెల నెల EMI ల రూపంలో కట్టేస్తూ ఉంటారు. అయితే అందరూ ఋణాలు తిరిగి
చెల్లించలేరు అనేది జగమెరిగిన సత్యం. ఇలా ఋణాలు తిరిగి చెల్లించని వారికి
ఇచ్చిన ఋణాలని నిరర్ధక ఆస్తులు (Non Performing Assets - NPA - నాన్ పెర్ఫార్మింగ్
అసెట్స్ (ఎన్.పి.ఏ లు) ) అంటారు.
ఈ ఎన్.పి.ఏ లు ప్రతి ఏడాది కొండలు లాగా పెరిగిపోతున్నాయి.
అంటే ఏముంది బ్యాంకులకి రావాల్సిన లాభాలు కాస్త తగ్గుతున్నాయన్నమాట. ఆ నష్టాలను
పూడ్చుకోడానికి ఇలా తమ చార్జీలు పెంచుతున్నారు అనేది ఒక వాదన.
మరి అప్పులు వసూలు చేసుకుని నష్టాలు తగ్గించుకోవాలి కానీ
మన మీద ఆ భారం వేస్తే ఎలా అంటారా, అప్పులు వసూలు చెయ్యలేకపోడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి అప్పు
చేసిన వారు IP(Insolvency
Petition) ఫైల్
చేస్తారు. లేకపోతే ఆస్తులన్నీ ఒకరి పేరు మీద ఉండి అప్పు వేరే వారి పేరు మీద ఉంటాయి, అంతే కాకుండా మన
చట్టాలలో ఉండే చిన్న చిన్న లొసుగులు ఆసరాగా చేసుకుని అప్పులు తిరిగి చెల్లించకుండా
తప్పించుకుంటారు.
నగదు
రహిత లావాదేవీలు (Cashless Transactions)
మనం రోజూ వింటున్న
మరో మాట నగదు రహిత లావాదేవీలు. నగదు రహిత లావాదేవీలు అంటే మనకు తెలుసు ఏ.టి.యం కార్డుల ద్వారా, ఇంటర్నెట్, మొబైల్ ఆధారిత సేవల ద్వారా నగదు చెల్లింపులు మరియు నగదు బదిలీలు
చెయ్యడమని. మరి వీటికి బ్యాంకులు చార్జీలు పెంచడానికి లింకు ఏంటి అన్న అనుమానం
మనకు రాక మానదు.
"పొమ్మనకుండా పొగబెట్టడం" అనే సామెత మనకి
తెలుసు. బ్యాంకుల పని చూస్తుంటే అలానే ఉంది. ప్రజలకి నగదు రహిత లావాదేవీల గురించి
అవగాహన కలిపించి, వాటివల్ల లాభాలను మనకి అర్ధం అయ్యేలా చెప్పి ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా నగదు లావాదేవీల
మీద చార్జీల మోత మోగించి మనం చచ్చినట్టు ఏ.టి.యం, ఇంటర్నెట్, మొబైల్ ఆధారిత సేవలు
తప్పకుండా వాడేలా చేస్తున్నారు.
కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఏ.టి.యం, ఇంటర్నెట్, మొబైల్ ఆధారిత సేవల మీద కూడా కనీస లావాదేవీల తరువాత చార్జీలు వసూలు
చేస్తున్నారు. నగదు రహిత లావాదేవీల వైపు ప్రోత్సహించే ఉద్దేశమే ఉంటే ఈ లావాదేవీల మీద చార్జీలు విధించకూడదు కదా? ఈ ప్రశ్నకి ఒక సమాధానం కనిపిస్తుంది. ఏంటంటే ఎన్.పి.ఏ ల వల్ల వస్తున్న
నష్టాలను తగ్గించడం కోసమే అని.
ఆర్.బీ.ఐ
నగదు సరఫరా తగ్గించడం
నగదు మార్పిడి
తరువాత ఆర్.బీ.ఐ సరిపడా నగదు ముద్రించి సరఫరా చెయ్యలేదు అనేది ఒక వాదన.
సరిపడా నగదు లేదు కాబట్టి నగదు లావాదేవీలని వీలైనంత వరకూ నియంత్రించాలన్నది ప్రభుత్వం ఆలోచన అయ్యుండొచ్చు.
అధిక
నగదు నిల్వలు
నగదు మార్పిడి
తరువాత చాలా వరకు ఇంట్లో మూలిగిన డబ్బు మొత్తం బ్యాంకు పొదుపు ఖాతాలలో వెళ్ళి జమ
అయ్యింది. ఇలా అధిక మొత్తంలో ఉన్న నిల్వల్ని మళ్ళీ ఋణాలు ఇచ్చి బ్యాంకులు అధిక
లాభాలు సంపాదించడానికి వేసిన ఎత్తుగడ కావొచ్చు. బ్యాంకులో నుండి నగదు వెనక్కి
తీసుకోకుండా జనాన్ని చార్జీలు వేసి నిలువరించి వాళ్ళ ఆలోచనకి కార్య రూపం
ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని మనం అనుకోవచ్చు.
![]() |
| ఈనాడు పేపర్ నుండి సేకరించబడినది |
SBI మరియు అనుబంధ బ్యాంకుల విలీనం
మన దేశంలో SBI అన్ని బ్యాంకుల కంటే
పెద్దది అని మనకి తెలిసిన విషయమే. ఇటీవల SBI అనుబంధ బ్యాంకులు SBIలో విలీనం
అయిపోయాయి. ఇదొక భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. SBIలో పని చేసే వారికి అనుబంధ బ్యాంకుల్లో ఇచ్చే జీతాలకంటే ఎక్కువే ఇస్తారు. బ్యాంకులు విలీనం
అయ్యాయి కాబట్టి ఇప్పుడు అనుబంధ బ్యాంకు ఉద్యోగులకి కూడా SBI ఉద్యోగులకి సమానంగా జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. కాబట్టి
పెరిగే వ్యయాలను తట్టుకోవడం కోసం SBI చార్జీలు పెంచిందన్నది
ఒక వాదన. SBI చార్జీలు పెంచేసరికి
మిగతా బ్యాంకులు చార్జీలు పెంచుకోడానికి ఒక కారణం దొరికినట్టు అయ్యింది.
లావాదేవీల్లో పారదర్శకత
90 నుంచి 95 శాతం నల్ల లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. వీటిని కట్టడి
చెయ్యడానికి ఇలా నగదు లావాదేవీల మీద చార్జీలు వేశారు అనుకోవచ్చు. బ్లాక్ మార్కెట్
లావాదేవీలు ఎప్పుడైతే పూర్తిగా నివారించగలుగుతారో
అప్పుడే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలుగుతాం.
కానీ చిన్న వ్యాపారాలు, బడుగు బలహీన వర్గాలు
ఇబ్బంది పడకుండా ఇవన్నీ అమలు చేయగలిగితే బాగుండేది. ఏది ఏమైనా ప్రభుత్వాలు
తీసుకునే ప్రతిచర్య మన అభివృద్ధి కోసమే తీసుకుంటారు కాబట్టి , ఇది కూడా మన మంచికోసమే అనుకుని బ్యాంకులకు ప్రభుత్వానికి మన సహకారం
అందిద్దాం.
ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలు తెలుపడానికి ఇప్పుడే
డౌన్లోడ్ చేసుకోండి మన యాప్. మీ ఆలోచనలు పంచుకోడం వల్ల మన అందరికీ లాభం కలగవచ్చు కాబట్టి తప్పకుండా కామెంట్
చెయ్యండి.



