ఒకావిడ అర్ధరాత్రి మెలుకువ వచ్చి నిద్రలేచింది. చూస్తే తన భర్త ఆమె పక్కన లేడు. ఎక్కడికి వెళ్ళాడో చూద్దామని ఆమె బెడ్ రూమ్ లో నుంచి బయటకి వచ్చి చూసింది. ఆమె భర్త హాల్ లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీర్ఘంగా అనంతంలోకి చూస్తూ కనిపించాడు. టేబుల్ మీద పొగలు కక్కుతున్న కాఫీ కప్పు కూడా ఉంది.
ఆమె అతన్ని అలా చూస్తూ ఉండగా అతని కంట్లోనుంచి రాలుతున్న కన్నీటి బొట్టుని తుడుచుకుని కాఫీ తాగాడు. "ఏమైందండి? ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు?" అని ఆమె అతనితో అంది.
కాఫీ కప్పు పక్కన పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ "నీకు గుర్తుందా బంగారం మనం 20 ఏళ్ళ క్రితం మనం ప్రేమించుకుంటున్న రోజులు, అప్పుడు నీకు 18 ఏళ్ళు అనుకుంట" అన్నాడు.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి, నా భర్త నా గురించి ఇంత ఆలోచిస్తాడా అని ఆమె మనసులో అనుకుంది." అవునండి నాకు గుర్తుంది" అని సమాధానం ఇచ్చింది.
అతని నోట్లోనుంచి మాటలు తడబడుతూ వస్తున్నాయి. అతను చాలా బాధలో ఉన్నట్లు అర్ధం అయిపోతుంది. "నీకు గుర్తుందా ఆరోజు నేను మీ ఇంటికి వచ్చాను, మనం ఎంతో సేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసాం, చివరికి నేను నీకు ముద్దు పెట్టబోతుంటే సడన్ గా మీ నాన్న వచ్చేసాడు ఇంటికి?" "గుర్తుందండి" అని ఆమె సమాధానం ఇచ్చింది.
"నీకు గుర్తుందా మీ నాన్న నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి, నిన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను జైలు లో పెట్టించి 20 ఏళ్ళ వరకూ బయటకి రానివ్వను అని అన్నాడు ?"
"అవునండి గుర్తుంది " అని ఆమె బదులు ఇచ్చింది శాంతంగా.
ఉబికి వస్తున్నా ఏడుపుని దిగమింగుతూ , కంట్లో నుంచి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అతను ఇలా అన్నాడు " ఇవాళ నేను జైలు నుంచి విడుదల అయ్యేవడ్ని".

0 Comments