దెయ్యాలు భూతాలు ఉన్నాయని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నాకెప్పుడు వాళ్ళ మాటలు నమ్మాలని అనిపించదు. నమ్మేవాళ్ళంతా వెర్రి వెధవలని నా ఆలోచన. ఇలా ఆలోచిస్తూ నేను ఎక్కాల్సిన ట్రైన్ కోసం ప్లాట్ఫారం మీద నుంచుని ఎదురుచూస్తూ ఉన్నాను. 



స్టేషన్ లో పెద్దగా జనం లేరు. నేను పట్టలవైపు అలా చూస్తూ ఉన్నా. ఇంతలో పట్టాలు మలుపు తిరుగే చోట కొంతమంది అటునుంచి పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించారు. ఒక 4-5 మంది ఉంటారు. అందరు 20-25 ఏళ్ళ మధ్య ఉన్నవారిలా అనిపించారు. వారి మొఖంలో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళంతా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని పరిగెడుతుంటే నాకు కూడా కాస్త భయం వేసింది. 

ఇంతలో చెవ్వులు దద్దరిల్లేల ట్రైన్ కూత వినిపించింది. ఇక పరిస్తితి ఏంటో పూర్తిగా అర్ధం అయిపోయింది. వాళ్ళు ట్రైన్ నుంచి తప్పించుకోడానికి పరిగెడుతున్నారు. కానీ వాళ్ళు పట్టాల మీదే పరిగెడుతున్నారు, పక్కకి జరగట్లేదు. భూమి దద్దరిల్లేల, దిక్కులు పెక్కటిల్లేలా, రైలు మృత్యువులా, మరణ మృదంగం మోగిస్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది. 

"అయ్యో! అయ్యో! పక్కకి జరగండి రా ట్రైన్ వచ్చేస్తుంది," అన్న నా మాటలు నా గొంతులోనే ఆగిపోయాయి. నాకు తెలీకుండానే నేను వాళ్ళ వైపు పరిగెత్తడం మొదలు పెట్టాను. వాళ్ళని కాపాడగలనన్న నమ్మకం నాకు లేదు కానీ నన్ను నేను మాత్రం ఆపుకోలేక వాళ్ళ వైపే పరిగెత్తసాగాను.

 "ఆగండి, ఆపండి చచ్చిపోతారు" అని నేను అనే లోపలే రైలు వాళ్ళని గుద్దేసింది. వాళ్ళ ఆర్తనాదం పూర్తవకముందే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళ శరీరాలు ముక్కలవుతుంటే చూడలేక నేను అందరి ముందు ఏడ్చేసాను. తన పని అయిపోయింది అన్నట్టుగా రైలు వెళ్ళిపోయింది.

భయం బాధ తో వణికిపోతున్న నేను, కళ్ళు తెరిచి చూసాను. ముక్కలు ముక్కలుగా శరీరాలు ఉంటాయని అనుకున్న నాకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. చచ్చిపోయారు అనుకున్నవరంతా గట్టిగట్టిగా నవ్వుతున్నారు. ఒకడు పొట్ట పట్టుకుని కింద పడి మరీ నవ్వుతున్నాడు. వాళ్ళు నన్ను ఒక వెర్రి వెధవలా చూస్తున్నారు. చుట్టూ తిరిగి చూస్తే జనం కూడా నన్ను పిచ్చి పట్టినవాడిలా చూస్తున్నారు. ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి " ఏమైంది బాబు ఒంట్లో బాగోలేదా? ఏమైనా చూసి భయపడ్డావా? " అన్నాడు. పట్టాలు మీద ఉన్నవాళ్ళలో ఒకతను పైకి వచ్చి " ఇప్పటికైనా నమ్ముతావా మేము ఉన్నామని?" అని మాయమైపోయాడు. మిగత వారు కూడా ఇక కనిపించలేదు. 



Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి


Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి